18 April, 2024

గండాంతము

గండాంతము అనగా, రెండు రాశుల, రెండు నక్షత్రాల మధ్య గల సంధి కాలము 

04 December, 2019

ఆరూఢము


ఆరూఢము

ఒక రాశి నుండి ఆ రాశ్యాధిపతి ఎన్నవ రాశిలో ఉన్నాడో అక్కడ నుండి అన్నవ రాశి ఆ ఆరూఢము అవుతుంది.  ఆరూఢమూలు వరుసగా... (1)లగ్నారూఢము, (2)ధనారూఢము, (3)విక్రమారూఢము, (4)వాహనారూఢము, (5)మంత్రారూఢము, (6)విజయారూఢము, (7)దారారూఢము, (8)అష్టమారూఢము, (9)భాగ్యారూఢము, (10)రాజ్యారూఢము, (11)లాభారూఢము, (12)ఉపపదారూఢము.  
ఉదా:

బు శు
గు ర
కు

రాశి
కే చం
రా







పై ఉదాహరణ జాతకామందు కుంభ రాశి లగ్నము.  కుంభ రాశికి రాశ్యాధిపతి శని.  కుంభము నుండి శని 3వ స్థానములో మేష రాశియందున్నాడు.  మేష రాశి నుండి 3వ రాశి మిధున రాశి.  కావున మిధున రాశి లగ్నారూఢము అవుతుంది.  రాజ్యారూఢము నిర్ణయించవలెననుకొందాము.  రాజ్యారూఢము 10వది. లగ్నము నుండి 10వ రాశి వృశ్చికము.  వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు.  వృశ్చిక రాశి నుండి కుజుడు 7వ రాశియందున్నాడు.  అక్కడ నుండి 7వ రాశి వృశ్చికము. కావున వృశ్చిక రాశియే రాజ్యారూఢము.  అదేవిధంగా ధనారూఢము నిర్ణయించవలెననుకొందాము. లగ్నము నుండి 2వ స్థానము అయిన మీన రాశి ధనారూఢము. మీన రాశి అధిపతి గురుడు.  మీన రాశి నుండి గురుడు 2వ స్థానమైన మేష రాశిలో ఉన్నాడు.  కావున మేషరాశి నుండి 2వ స్థానమైన వృషభ రాశి ధనారూఢము అవుతుంది.   ఈ విధముగానే మిగతా ఆరూఢములను నిర్ణయించాలి.  

ఒక రాశిలో ఎక్కువ భాగలు నడిచిన గ్రహము ఆత్మ కారకుడు.  అంతకంటే తక్కువ భాగలు నడిచిన గ్రహము అమాత్య కారకుడు.   అదే విధంగా తరువాత గ్రహము భాతృ కారకుడు.  తదుపరి వరుసగా మాతృ కారకుడు, పితృ కారకుడు, పుత్ర కారకుడు, జ్ఞాతి కారకుడు, ధారా కారకుడు.  

12 July, 2019

అయనాంశ – సాయన, నిరయన రాశి చక్రము

అయనాంశ సాయన, నిరయన రాశి చక్రము

          ఆకాశములో సూర్యుడు పరిభ్రమించగలిగే మార్గాన్ని రవి మార్గము అందురు.   అంటే సూర్యుడు పన్నెండు రాశులగుండా ప్రయాణించి ఏడాదికి ఒక చుట్టు తిరిగి వచ్చే మార్గము.  ఇది స్థిరంగా ఉంటుంది  (వాస్తవానికి ఇది సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూకక్ష్య).  ఈ రవి మార్గాన్ని 23 ½ డిగ్రీల వాలులో భూమధ్య రేఖ రెండు బింధువుల వద్ద ఖండిస్తుంది.  ఈ ఖండన బింధువులను విషవత్తులు (equinoxes) అని అందురు.  ఒకటి వసంత విషవత్తు, రెండు శరద్విషవత్తు.  వసంత విషవత్తును (ఉత్తర విషవత్తు) ప్రారంభ బింధువుగా స్వీకరించి రాశి చక్రాన్ని 12 భాగాలు చేసే పద్దతిని సాయన రాశి చక్రము అందురు.  ఈ బింధువు స్థిరంగా ఉండదు.  సంవత్సరానికి 50.24 సెకనుల చొప్పున ఈ బింధువు సుమారు 26,000 సంవత్సరాలకు ఒకసారి రాశి చక్రము మొత్తము పూర్తిగా తిరుగుతుంది.  అశ్విన్యాది నక్షత్రాల ఆధారంగా ఏర్పడిన రాశి చక్రాన్ని నిరయన రాశి చక్రము అని అందురు.  ఇది స్థిరమైన రాశి చక్రము.  సాయన రాశి చక్రానికి, నిరయన రాశి చక్రానికి గల దూరాన్ని అయనాంశ అని అందురు.

          ఈ అయనాంశ విషయాన్ని వేరు వేరు పేర్లతో పూర్వము గుర్తించారు.  ఋషులు దీనిని అగస్త్య చారమని, సప్తర్షి చారమని అన్నారు.  అయానాంశలో తేడాల వల్ల జాతక చక్రాలు భిన్నంగా ఏర్పడుతుంటాయి.  అందువలన ఫలితములలో చాలా తేడా వస్తుంది.  అయానాంశను నిర్ణయించుటకు సాయన, నిరయన రాశి చక్రాల ప్రారంభ బింధువులు ఏకమైన సంవత్సరము సున్న.  అయనాంశ సంవత్సరమును వేరు వేరు శాస్త్రజ్ఞులు వేరు వేరుగా నిర్ణయించిరి.  వేరు వేరు అభిప్రాయముల ప్రకారం ఆయన శూన్య సంవత్సరములు ఈ క్రింది విధముగానున్నవి. 

          N.C. లహరి   ...       ...       ...       క్రీ.శ. 285 సం.
          కృష్ణమూర్తి     ...       ...       ...       క్రీ.శ. 291 సం.
          బి.వి. రామన్  ...       ...       ...       క్రీ.శ. 397 సం.
          మధుర కృష్ణమూర్తి శాస్త్రి        ...       క్రీ.శ. 411 సం.
          షీరో     ...       ...       ...       ...       క్రీ.పూ. 388 సం.
          డేవిడ్ సన్      ...       ...       ...       క్రీ.పూ. 317 సం.

          లహరి అయనాంశ రీత్యా సున్న అయనాంశ క్రీ.శ. 285 సం. ఆదివారం 22.3.285 నాటి 21 గం. 27 ని. (IST) సాయన రీత్యా, నిరయన రీత్యా చిత్తా నక్షత్ర స్ఫుటం 1800 0 03 ఒకటే అయినది.  భారత ప్రభుత్వము వారు ఏర్పాటు చేసిన Calendar Reforms Committee నిర్ణయించినది కూడా క్రీ.శ. 285 సం.  కావున ఇదియే సరియైనది.  నిరయన పద్దతి రీత్యా లగ్న స్ఫుటం, భావ స్ఫుటం, గ్రహ స్ఫుటం నిర్ణయించడానికి అయనాంశ తప్పనిసరిగా అవసరమున్నది.  

03 July, 2019

ద్వాదశ భావాలు – సంక్షిప్త విశ్లేషణ


ద్వాదశ భావాలు సంక్షిప్త విశ్లేషణ

జాతకుడు బాగుండాలి అంటే జాతకుని యొక్క తనూ భావము (లగ్నము) బాగుండాలి. తనూ భావము (లగ్నము) బాగుండాలి అంటే వ్యయ స్థానము (12వ భావము) బాగుండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యయము చేయగలగాలి అంటే లాభాలు లేదా సంపాదన బాగుండాలి.  అంటే లాభ స్థానం (11వ భావము) బాగుండాలి.  లాభాలు లేదా సంపాధన బాగుండాలి అంటే వృత్తికి సంబందించిన 10వ భావము బాగుండాలి.  ఇక్కడ వృత్తి అనగా వ్యాపారము కావచ్చు, ఉద్యోగము కావచ్చు లేదా నైపుణ్యము కావచ్చు. దశమ భావము బాగుండాలి అంటే అందుకు అతడు లేదా అతని తల్లిదండ్రులు ఎంతో పుణ్యము చేసుండాలి.  ఇందుకు నవమ (9వ) భావము బాగుండాలి.  నవమ భావము బాగుండాలి అంటే జాతకుడు ఎంతో కష్టపడాలి, ఇబ్బందులను ఎదుర్కోగలగాలి.  దీనికి అష్టమ (8వ) భావము (ఆకస్మిక ధనలాభము, స్పెకులేషన్ మొ. కూడా) బాగుండాలి.  అష్టమ భావము బాగుండాలి అంటే సప్తమ (7వ) భావము (కళత్రము, సంబంధాలు, రిలేషన్స్ మొ.) బాగుండాలి.  సప్తమ భావము బాగుండాలి అంటే శత్రు, రోగ, ఋణ స్థానము (6వ భావము) బాగుండాలి. అందుకు జాతకుని యొక్క ఆలోచనా సరళి, సంతానము (పంచమ భావము) బాగుండాలి.  అందుకు తల్లి ప్రేమ, సౌఖ్యము, విద్య, ఆహార నియమాలు మొ. (చతుర్ధ భావము) తోడ్పడుతుంది.  దానికి అందరి సహకారము (తృతీయ భావము) కావాలి.  సహకారము పొందాలి అంటే ధనము, మంచి వాక్కు (ద్వితీయ భావము) కలిగి ఉండాలి.  

          ద్వాదశ భావాలలో ఒక భావమునకు మరొక భావమునకు అంతర సంబంధము (inter-link) కలిగి ఉంటుంది.  కావున జాతకులు మంచి వాక్కు, నడవడి, ప్రవర్తన కలిగి ఉండవలెను.

02 July, 2019

కేమద్రుమ యోగము


గోచారములో శుభ ఫలితములనిచ్చు గ్రహములు


రాశి చక్రము, నక్షత్రములు, పాదములు

రాశి చక్రము, నక్షత్రములు, పాదములు 

ఉత్తరాయణము – దక్షిణాయనము


కొన్ని పత్రికలలో, TV లలో ఇప్పుడు ఉత్తరాయణము అని కొన్నింటిలో, దక్షిణాయనము అని కొన్నింటిలో పేర్కొంటున్నారు అని, ఏది వాస్తవము అని మిత్రులు శ్రీ అద్దేపల్లి చెంచయ్య గారు మరియు శ్రీ పద్మనాభ రావు గారలు సందేహము వ్యక్తము చేసినారు. దానికి ఈ క్రింది వివరణ :

-------------------------------------------------------------------------------------------------------------  

          ఉత్తరాయణము మరియు దక్షిణాయనము అనగా నేమి? హిందూ పంచాంగ వివరణలో దీనిని తరుచుగా చెప్తూ ఉంటారు. 

          ఖగోళశాస్త్ర రీత్యా భూమి యొక్క భూమధ్య రేఖకు ఉత్తర భాగమును ఉత్తరార్ధగోళము (Northern Hemisphere), దక్షిణ భాగమును దక్షిణార్ధగోళము (Southern Hemisphere) అందురు. హిందూ పంచాంగ రీత్యా సూర్యుడు ఉత్తరార్ధగోళములో సంచరించే కాలమును ఉత్తరాయణము అని, అదేవిధంగా దక్షిణార్ధగోళములో సంచరించే కాలమును దక్షిణాయనము అందురు.  

          సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నప్పటికి, భూమిపైనున్న మనకు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుచున్నట్లు అగుపించును.  ఆ ప్రకారం హిందూ పంచాంగం ప్రకారం గోచార (గ్రహ సంచార) రీత్యా సూర్యుడు ఉత్తరార్ధగోళము వైపు సంచరించు ఆరు నెలల కాలమును ఉత్తరాయణము అని, దక్షిణార్ధగోళము వైపు సంచరించు ఆరు నెలల కాలమును దక్షిణాయనము అందురు.  సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉండి, మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు.  ఇలా, ఒక రాశి నుండి మరొక రాశిలో సూర్యుడు ప్రవేశించడానిని సంక్రమనము అందురు.  ఉదాహరణకు ....  మేష సంక్రమనము, వృషభ సంక్రమనము .... ఆ విధంగా ధనసు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడానిని మకర సంక్రమణం అందురు.  దానినే మనము మకర సంక్రాంతి అని కూడా పిలుచుకొంటున్నాము.  మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సమయము నుండి 6వ రాశి అయిన మిధున రాశి వరకు (అనగా 6 నెలలు) సూర్యుడు సంచరించిన కాలమును ఉత్తరాయణము అందురు.  ఆదేవిదంగా, సూర్యుడు కర్కాటక సంక్రమనము (అనగా ప్రవేశము) మొదలుకొని అక్కడి నుండి 6వ రాశి అయిన (అనగా 6 నెలలు) ధనసు రాశి వరకు సంచరించు కాలమును దక్షిణాయనము అందురు.

          పై వివరణ ప్రకారము సూర్యుడు ప్రస్తుతము మిధున రాశిలో 16 డిగ్రీలల 06 నిమిషాల 34 సెకనులలో ఉన్నాడు.  కావున ప్రస్తుతము ఉన్నది ఉత్తరాయణ పుణ్యకాలమే. సూర్యుడు జూలై 2019, 17 తేదీన తెల్లవారుజామున గం. 04.41 నిముషాలకు కర్కాటక సంక్రమనము (ప్రవేశము) చేయబోవుచున్నాడు. అప్పటి నుండి దక్షిణాయనము ప్రారంభము అగును.

01 July, 2019

లగ్నాలకు యోగకారక గ్రహాలు, ఆధిపత్యం వలన శుభ పాప గ్రహాలు


లగ్నాలకు యోగకారక గ్రహాలు ఆధిపత్యం వలన శుభ పాప గ్రహాలు

          లగ్నము నుండి 1, 4, 7, 10 స్థానములను కేంద్రములని; 1, 5, 9 స్థానములను కోణములని అందురు.  కేంద్ర స్థానములను విష్ణు స్థానములని, కోణ స్థానములను లక్ష్మీ స్థానములని చెప్పబడుచున్నవి.  

          ఒక జాతకమున కేంద్ర కోణాధిపత్యములు గ్రహము ఆ జాతక లగ్నమునకు యోగకారక గ్రహమగుచున్నది.  ఉదాహరణకు వృషభ లగ్న జాతకులకు శని యోగకారక గ్రహము.  వృషభము నుండి నవమ కోణాధిపతి, దశమ కేంద్రాధిపతి శని.  అట్లే, తులా లగ్నమునకు చతుర్ధ కేంద్రాధిపతిగా, పంచమ కోణాధిపతిగా శని యోగకారకుడు. అట్లే, కర్కాటక లగ్నమునకు పంచమ కోణాధిపతిగా, దశమ కేంద్రాధిపతిగను మరియు సింహ లగ్నమునకు చతుర్ధ కేంద్రాధిపతిగా, నవమ కోణాధిపతిగను కుజుడు కర్కాటక సింహ లగ్నములకు యోగకారకుడు.  ఇట్లే, మకర కుంభములకు శుక్రుడు యోగకారకుడు.  మకరము నుండి 5, 10 స్థానములు, కుంభము నుండి 4, 9 స్థానములు శుక్రుడు కేంద్రాధిపతిగా గల వృషభ తులా రాశులు.  

          కేంద్రాధిపత్యము శుభ గ్రహములకు పట్టిన అది దోషము.  అందుచే ఆ గ్రహములు పాపులగుదురు.   పాప గ్రహములు కేంద్రాధిపత్యమున శుభులు అగుదురు.  సామాన్యంగా 3, 6, 8, 11 భావాల ఆధిపత్యం కల గ్రహాలు పాపులు.  5, 9 భావాల ఆధిపత్యము గలవారు శుభులు.  లగ్నాధిపతియే 8వ స్థానమునకు అధిపతి అయిన అతడు శుభుడే అగుచున్నాడు.  అష్టమాధిపత్య దోషము రవి చంద్రులకు లేదు.  లగ్నాధిపతి ఎల్లప్పుడును జాతకునకు శుభుడుగా ఉండుటకే ప్రయత్నించును.  ఒక పాప స్థానాధిపత్యము ఒక కోణాధిపత్యము కలిగిన గ్రహము కోణాధిపత్య బలముచే శుభుడే అగుచున్నాడు.  

లక్ష్మీ యోగము - శ్రీనాధ యోగము


లక్ష్మీ యోగము

          భాగ్యాధిపతి మరియు శుక్రుడు స్వక్షేత్ర లేక ఉచ్చ క్షేత్రములందుండి అట్టిది కేంద్ర లేక కోణ స్థానమైన అది లక్ష్మీ యోగము అగును.  ఈ యోగ జాతకుడు ధనవంతుడు, సుఖవంతుడు, నీతిమంతుడు, ఎక్కువ పుత్రులు కలవాడును అగును.

శ్రీనాధ యోగము

          భాగ్యాధిపతి, శుక్రుడు మరియు బుధుడు స్వక్షేత్ర, ఉచ్చక్షేత్ర, మిత్ర క్షేత్రములలో ఉండి అట్టి క్షేత్రము కేంద్ర లేక కోణ స్థానమైన అది శ్రీనాధ యోగము అగును. సప్తమాధిపతి ధశమమందు ఉచ్ఛలో ఉండి, భాగ్యాధిపతితో కలిసి ఉండినను అది శ్రీనాధ యోగము అగును.

          ఉదాహరణకు ధనుర్లగ్నమునకు సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్య స్థానాధిపతి అయిన రవితో కలిసి ధశమ స్థానమైన కన్యలో ఉండిన అది శ్రీనాధ యోగము అగును.

          ఈ యోగ జాతకుడు రాజ సమానుడు, భాగ్యవంతుడు, స్పురధ్రూపి, మంచి భార్యా పిల్లలు కలవాడు అగును.

ముహూర్త నిర్ణయము – పంచక రహితము



శ్లో.
తిథి వారోడుబిర్యుక్తం తత్కాలోదయ మిశ్రితమ్
నవభిస్తు హరేర్భాగం శేషం పంచకమీరితం

          తత్కాల తిథి (పక్షాదిగా), వార (ఆదివారం మొదలు), నక్షత్రం, లగ్న సంఖ్యలను కలుపగా వచ్చిన సంఖ్యను 9చే భాగించగా శేషం ....

          1 వచ్చిన అది మృత్యు పంచకం
          2 వచ్చిన అది అగ్ని పంచకం
          4 వచ్చిన అది రాజ పంచకం
          6 వచ్చిన అది చోర పంచకం
          8 వచ్చిన అది రోగ పంచకం

          పై అయిదు పంచకములు రాకుండా ముహూర్త నిర్ణయము చేయవలెను. 
          శేషము 3, 5, 7, 0 వచ్చినచో అవి పంచక రహితమగు ముహూర్తము అగును.

26 June, 2019

నీచభంగ రాజయోగము

          నీచను పొందిన  గ్రహము అశుభ ఫలితములనిచ్చును.  అట్టి నీచ భంగమైనచో ఆ గ్రహము చాలా శుభ ఫలితములనిచ్చును.  నీచను పొందిన గ్రహము యొక్క నీచ భంగమైనచో  దానిని నీచ భంగ రాజయోగము అందురు.  

నీచ భంగపడు విధానము :

   1) గ్రహము ఏ రాశిలో అయితే నీచ స్థితిని పొందినదో, ఆ రాశ్యాధిపతి లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న నీచ భంగమగును
   2)  నీచను పొందిన గ్రహము స్థితినొందిన రాశియందు ఏ గ్రహము ఉచ్చ స్థితిని పొందునో, ఆ గ్రహము లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న నీచ భంగమగును
     3)  నీచను పొందిన గ్రహము లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న నీచ భంగమగును
     4)  నీచను పొందిన గ్రహమున్న రాశ్యాధిపతి, నీచను పొందిన గ్రహము ఉచ్చను పొందు రాశ్యాధిపతి లగ్నాత్తు లేక చంద్రాత్తు కేంద్రములందున్న యెడల నీచ భంగమగును
   5)  నీచను పొందిన గ్రహమున్న రాశ్యాధిపతి, ఆ నీచను పొందిన గ్రహము ఉచ్చను పొందు రాశ్యాధిపతి పరస్పరము కేంద్రములందున్న నీచ భంగమగును
     6)  నీచను పొందిన గ్రహము స్థితి పొందిన రాశ్యాధిపతిచే చూడబడినను నీచ భంగమగును

ఈ నీచ భంగ రాజయోగము మొదట నీచను పొందిన గ్రహము యొక్క అశుభ ఫలితములనిచ్చును.  నీచనొందిన గ్రహము మొదట కష్టములను కలుగజేయును.  తరువాత కష్టములనిచ్చుట మానివేసి మంచి శుభ ఫలితములనిచ్చును.

ఫలితములు :

         ఈ జాతకుడు ఆరోగ్యవంతుడు, గాయకుడు, నాట్యము చేయువాడు, ధనవంతుడు, తెలివిగలవాడు, శాస్త్ర పాండిత్యము గలవాడు, విధేయత గల భార్య గలవాడు, సుఖవంతుడు, అన్ని ప్రదేశములందును గౌరవమును పొందువాడు, విదేశములందు నివాసము, నిత్య సంతోషి, రాజకీయములందు  నిపుణుడు, శత్రుంజయుడు అగును.

         గజదొంగ, బుద్దిలేనివాడు, క్రూరుడు, అనుమానించువాడు, పిల్లలు లేనివాడు కూడా అగును. 

         ఈ ఫలితములు నీచను పొందిన గ్రహమును బట్టి ఉండును.

పంచాంగము - ప్రయోజనములు

పంచాంగము :

            తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలకు పంచాంగము అని పేరు.  ఐదు అంగములు కలది కావున దీనిని పంచాంగము అందురు.  దీనిలో పై ఐదు అంగాలతో పాటు రవ్యాదుల స్థిత్యాది విశేషాలున్నాయి.  పంచాంగమునందు తిథ్యాదులు ఎన్ని గంటలవరకు ఉంటాయో ప్రతి దినమునకు వ్రాస్తారు. ఆ దినమునకు చెందిన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు, ఇంగ్లీష్ తేదీలు, శాలివాహక శకం తేదీలు, ఆ రోజున సంచరించే గ్రహాల పేర్లు ఉంటాయి.  తిథి, వార, నక్షత్ర, యోగా, కరణం వరుసగా వ్రాయబడి ఉంటాయి.  ఆయనం, ఋతువు, ఇంగ్లీష్ తేదీల ప్రక్కన ఇంగ్లీష్ నెల, సంవత్సరం వ్రాయబడతాయి.  తిథి, నక్షత్రాల తరువాత అవి ఆ దినం ఎంత వరకు ఉంటాయో ఆ కాలాన్ని వ్రాస్తారు.  దుర్ముహూర్త ప్రారంభ సమయము ఇచ్చి ఎంత కాలము త్యాజ్యమో వ్రాస్తారు.  ఆ నెల ప్రారంభములో గ్రహస్థితిని తెలిపే చక్రం ఉంటుంది.  లగ్నాంత కాలములు పగటికి రాత్రికి చెందినవి ఉంటాయి.  సుముహూర్తాలు, గ్రహణాలు, మూఢములు మొదలగునవి సూచించబడతాయి.  

తిథులు :

            తిథులు 15.  అవి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ / అమావాస్య.  

            తిథులు ఐదు రకాలు.  అవి .....
1)    నంద తిథులు .... పాడ్యమి, షష్టి, ఏకాదశి
2)    భద్ర తిథులు ..... విధియ, సప్తమి, ద్వాదశి
3)    జయ తిథులు ... తదియ, అష్టమి, త్రయోదశి
4)    రిక్త తిథులు ..... చవితి, నవమి, చతుర్దశి
5)    పూర్ణ తిథులు ... పంచమి, దశమి, పూర్ణిమ / అమావాస్య

            ఇందు రిక్త తిథులు శుభ కార్యములకు పనికిరావు.  ఆంధ్రులు షష్టి, అష్టమి, అమావాస్యలను కూడా అశుభ తిథులుగానే పరిగణించుట పూర్వాచారము.

వారములు :
           
            వారములు 7.  అవి ఆదివారము, సోమవారము, మంగలవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము.  సూర్యోదయ కాలమున ఏ గ్రహము యొక్క హోరా ఉండునో, ఆ గ్రహ నామము ఆ దినమునకు పెట్టబడినది.  ఇందు మంగలవారము ఉగ్రవారము, శనివారము దారుణవారము. 

నక్షత్రములు :

            నక్షత్రములు 27.  అవి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర (ఉత్తర ఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.

            ఉత్తరాషాడ చివరి 4వ పాదం నుండి, శ్రవణ నక్షత్ర కాలమండలి మొదటి నాలుగు ఘడియల కాలమును అభిజిత్ నక్షత్రమని వ్యవహరింతురు.

            నక్షత్రాలకు అధిదేవతలుగా కొందరిని గుర్తించడం జరిగినది.  ఆయా దేవతలననుసరించి నక్షత్రము యొక్క శుభాశుభాలు ఆధారపడి ఉంటాయి. 

యోగాలు :

            యోగాలు 27.  అవి విష్కుంభమ్, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోధన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ది, దృవ, వ్యాఘాత, హర్షణ, వజ్ర, సిద్ది, వ్యతీపాత, వరీయన్, పరిఘ, శివ, సిద్ద, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఇంద్ర, వైధృతి.

            వీటిలో, విష్కుంభ, అతిగండ, శూల, గండ, వ్యాఘాత, వజ్ర, వ్యతీపాత, పరిఘ మరియు వైధృతి అనునవి తొమ్మిది నింధ్యములు.

కరణములు :

            కరణములు 11.  అవి బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణిజ, భద్ర, శకుని, చతుష్పాద, నాగ, కింస్థుజ్ఞ.  వీటిలో మొదటి 7 చర కరణాలు, చివరి 4 స్థిర కరణాలు.   స్థిర కరణములు నింధ్యములు.

పంచాంగ ప్రయోజనములు  :

1)    వైదిక కర్మలు చేయవలసిన సరియైన కాలము తెలుసుకొనుట
2)    రవ్యాధి గ్రహాల స్థితిని తెలుసుకొనుట
3)    సుముహూర్తములను తెలుసుకొనుట
4)    సంవత్సరము, ఆయనము, ఋతువు, మాసము, పక్షము, వారము, తిథి మొదలగు కాలమును తెలుసుకొనుట
5)    సూర్యోదయ, సూర్యాస్తమాన కాలములు తెలుసుకొనుట
6)    పండుగ దినములను తెలుసుకొనుట
7)    వర్జ్య కాలము, దుర్ముహూర్త కాలములను తెలుసుకొనుట
8)    జాతక చక్రములు వేయుటకు
9)    గ్రహణ కాలములు, గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి కాలములు, గోచార ఫలములు

            --- మొదలగునవి తెలుసుకొనుట అనునవి పంచాంగము యొక్క ముఖ్య ప్రయోజనములు.